బండి సంజ‌య్‌ని ప్ర‌ధానిని చేసేందుకే అధ్య‌క్ష మార్పు: రాణి రుద్రమ

బండి సంజయ్‌ని ప్రధాని అభ్యర్ధిగా చేయడం కోసమే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు చేయబోతున్నారని రాణి రుద్రమ వ్యాఖ్యానించారు.

By అంజి  Published on  4 July 2023 11:28 AM IST
Telangana, BJP president , Bandi Sanjay , Prime minister, Rani Rudrama

బండి సంజ‌య్‌ని ప్ర‌ధానిని చేసేందుకే అధ్య‌క్ష మార్పు: రాణి రుద్రమ

తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు నిన్న బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల పగ్గాలు అప్పగించడం ఖాయమయ్యిందనే వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్వరలోనే అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం వెలువడనున్నది. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

బండి సంజయ్‌ని ప్రధాని అభ్యర్ధిగా చేయడం కోసమే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు చేయబోతున్నారని రాణి రుద్రమ వ్యాఖ్యానించారు. జాతీయ‌స్థాయిలో వారికి ఎలివేష‌న్ తీసుకువ‌చ్చి భ‌విష్య‌త్‌లో ఓ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కూడా సంజయ్‌ని ప్ర‌మోట్ చేయాల‌ని కూడా అధిష్టానం అనుకుని ఉండ‌వ‌చ్చు అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం రాణి రుద్రమ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఈ కామెంట్లను నెటిజ‌న్‌లు ఫ‌న్నీగా తీసుకుంటూ త‌మ‌దైన స్టైల్‌లో కామెంట్‌లు పెడుతున్నారు. రాణి రుద్రమ తన పొలిటికల్‌ హైప్‌ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అధ్యక్ష పదవి మార్పు గ్యారెంటీ అని తేలింది. ఈ నెల 8న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు తాను అధ్యక్షుడిగా వస్తానో లేదో అంటూ స్వయంగా బండి సంజయే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్షుడిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నిజమేనని తేటతెల్లమైంది.

Next Story