తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధం చేస్తున్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, నగేశ్ ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచ గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని తెలిపారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అరరారుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీయూ విద్యార్థులతో పాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ భూముల వివాదంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ.. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.