తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు వేళాయే
డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By - Medi Samrat |
డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన తర్వాత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం.. మరోవైపు ఆయనకు కౌంటర్‌గా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఈ సెషన్‌పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఈ సారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. సభలో అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం శీతకాలంలో సెగలు రేపనుంది.
అలాగే పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళిక గురించి చర్చ చేయనున్నట్లు సమాచారం.