రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణలో కులగణన అంశంపై చర్చించేందుకు రేపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి.
By Knakam Karthik
రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణలో కులగణన అంశంపై చర్చించేందుకు రేపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ధ్రువీకరించారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా లేఖలు రాసినట్లు చెప్పారు.
కులగణనలోని కీలక అంశాలపై చర్చించడానికి రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. కులగణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని సమాచారం. కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు, ఎస్టీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. కులగణన నివేదిక, సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందాయి.
ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌లో రేపు చర్చ ఇది ఇలా ఉంటే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది. నివేదికను ఈరోజు కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నది. ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తరువాత..రేపు కేబినెట్ ముందుకు వస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికలపై కేబినెట్‌లో చర్చించాక.. అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు.
రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర కేబినేట్ భేటీ అవుతుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు ఈ అంశాలపై చర్చించడానికి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్‌లు, ఎస్సీ వర్గీకరణపై సభ్యులు చర్చిస్తారు. గత నెలలో మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ .. తరువాత ప్రోరోగ్ చేయలేదు. దీంతో అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపర్చడానికి గవర్నర్అనుమతి లేకుండానే సమావేశం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు దొరికింది. ఈ అంశంపై చర్చించాక అసెంబ్లీని వాయిదా వేస్తారు.