తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు ప్రగతి భవన్‌లోకి ప్రవేశం కల్పించలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినిని పిలిపించి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అని సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుతో ప్రజలు వారిని ఓడించారని, ఇంకా వారు వైఖరిని మార్చుకోకుంటే ప్రజలు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చిందన్నారు.