తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్‌ మిస్సింగ్‌.. వారం రోజులు గడుస్తున్నా..

Telangana army jawan gannar missing. తెలంగాణకు చెందిన ఓ ఆర్మీ జవాన్‌ మిస్సింగ్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. వారం రోజులు గడుస్తున్నా.. జవాన్‌ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.

By అంజి  Published on  13 Dec 2021 2:35 AM GMT
తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్‌ మిస్సింగ్‌.. వారం రోజులు గడుస్తున్నా..

తెలంగాణకు చెందిన ఓ ఆర్మీ జవాన్‌ మిస్సింగ్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. వారం రోజులు గడుస్తున్నా.. జవాన్‌ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో జవాన్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్‌ రెడ్డి ఎన్నో కష్టాలను ఓర్చి ఆర్మీలో చేరాడు. పంజాబ్‌లో సాయికిరణ్‌ రెడ్డి గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 3 వారాల కిందట సాయికిరణ్‌ సెలవుపై ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఈ నెల 5వ తేదీన విధుల్లో చేరేందుకు తిరిగి బయల్దేరాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత నుండి అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు.

జవాన్‌ సాయికిరణ్‌ రెడ్డి ఫోన్‌ స్విచాఫ్‌ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. వారం రోజులుగా జవాన్‌ ఆచూకీ తెలియరాలేదు. ఇదే విషయమై పంజాబ్‌లోని ఆర్మీ అధికారులను సంప్రదించారు. అతను ఇంకా విధుల్లో చేరలేదని ఆర్మీ అధికారులు కిరణ్ తల్లిదండ్రులకు చెప్పారు. తమ కొడుకు ఆచూకీ కోసం సహకరించాలంటూ పలువురు నాయకులను, ప్రజా ప్రతినిధులను కలిశారు. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మంత్రి కేటీఆర్‌కి ట్విటర్‌లో సాయికిరణ్‌ కనిపించకపోవడంపై సమాచారం ఇచ్చాడు. జవాన్‌ సాయికిరణ్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.

Next Story
Share it