తెలంగాణ రైతులను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుస్తీలను చూసి అందరూ నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల గురించి మాట్లాడని కేటీఆర్.. ఈ ఏడాది కాలంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి అద్వానంగా మార్చారని దుయ్యబట్టారు. ఈ సంవత్సర కాలంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. వాటి కోసం ఖర్చు చేసిన నిధులు రూ.55,256 కోట్లు అని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇప్పటివరకు ప్రత్యక్షంగా రైతులకు నేరుగా ఖాతాల్లో జమ చేసింది రూ.40,000 కోట్లు అని చెప్పారు.
దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రభుత్వంలోనైనా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఇన్ని నిధులు ఒక్క రైతు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని చూపించగలరా అని బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. పావలా రుణమాఫీ అని ప్రతిసారి విమర్శించే నాయకులు.. 2018 రుణమాఫీ ఏ సంవత్సరంలో ప్రారంభించి ఏ సంవత్సరం వరకు, ఎంత మందికి చేశారో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే విశ్వసనీయత ఉండేదని ఎద్దేవా చేశారు. 2018లో చేయాల్సిన రుణమాఫీని ఎన్నికల్లో లబ్ధి కోసం ఆఖరి ఏడాది అయిన 2023 సంవత్సరంలో సగం మందికి చేసిన మీరా కాంగ్రెస్‌ను విమర్శించేది అంటూ మంత్రి తుమ్మల అన్నారు.