బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు

By Medi Samrat  Published on  13 March 2025 5:15 PM IST
బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి “మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు” అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “సభ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి” అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ భద్రతా అధికారులను అప్రమత్తం చేస్తూ.. మార్షల్స్‌ను భారీగా మోహరించారు. సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో, సభలో క్రమశిక్షణను కాపాడేందుకు స్పీకర్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.

సభలో జరిగిన హాట్ డిబేట్ అనంతరం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. “సభలోని నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు, అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు, జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల వరకూ సస్పెండ్ చేస్తున్నాను.” అని స్పీకర్ ప్రకటన చేశారు.

Next Story