మొదలైన హై డ్రామా..!
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని అందరూ భావించారు.
By Medi Samrat Published on 4 Dec 2023 7:40 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదా పడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని అందరూ భావించారు. అయితే వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు. సీఎం అభ్యర్థి ప్రకటన, ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. దీంతో డీకే శివకుమార్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చలు జరిపి సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఏ నేతకు ఏ పోర్ట్‌పోలియో ఇవ్వాలో కూడా చర్చించనున్నారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి నేడే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీసీ పరిశీలకుల నేతృత్వంలో ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సాయంత్రం వరకు ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణానికి సైతం ఏర్పాట్లు జరిగాయి. ఊహించని విధంగా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.