పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By - Knakam Karthik |
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న సుప్రీంకోర్టు..ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. కాగా తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి తెలిపారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలని తెలంగాణ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టికల్ 32 కింద పిటిషన్ నిలదొక్కుకుంటుందా? అన్న అంశంపై కోర్టులో విస్తృత వాదనలు జరిగాయి. గోదావరి జలాల కేటాయింపు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు (1979–80) ప్రకారం ఖరారైందని తెలంగాణ తరపున న్యాయవాదులు వాదించగా.. కేటాయింపుకు మించి నీటిని మళ్లించే ప్రయత్నం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ నీటిని ఎత్తుకునే మౌలిక సదుపాయాలు ఏపీ నిర్మిస్తోందని ఆరోపించారు.
మరో వైపు గోదావరి మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతులు లేకుండానే పనులు జరుగుతున్నాయని తెలంగాణ వాదించింది. కేంద్ర జల కమిషన్ మార్గదర్శకాలు ఉల్లంఘన జరిగిందని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇతర రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్ణాటక) పార్టీలుగా లేవని బెంచ్ అభిప్రాయ పడింది. ఆర్టికల్ 32 కింద పిటిషన్ కొనసాగింపుపై కోర్టు సందేహం వ్యక్తం చేయడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ తెలిపింది.
సివిల్ సూట్ దాఖలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలని తెలంగాణ అభ్యర్థించింది.“డిస్మిస్” కాకుండా *“డిస్పోజ్డ్ ఆఫ్”*గా నమోదు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్ ప్రైమా ఫేసీగా నిలదొక్కుకోదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఇతర చట్టబద్ధ మార్గాలను అనుసరించేందుకు తెలంగాణకు స్వేచ్ఛ ఇస్తూ పిటిషన్ డిస్పోజ్ చేసింది. అన్ని వాదనలు, అంశాలను తగిన ఫోరమ్‌లో లేవనెత్తవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సున్నిత అంశం కావడంతో విస్తృత వ్యాఖ్యలకు దూరంగా ధర్మాసనం ఉంది. ఈ క్రమంలో పోలవరం–నల్లమల్ల సాగర్ వివాదం ఇక సివిల్ సూట్ దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.