Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.
By Knakam Karthik
Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తదనంతరం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సీజేఐ తీర్పు వెలువరించనున్నారు. గతంలోనే ఈ కేసుపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. తెలంగాణ శాసన సభ స్పీకర్‌కు కోర్టులు సూచనలు చేసే అంశంపై కూడా సుప్రీంకోర్టు గురువారం పలు వివరాలను తెలపనుంది.
శాసన సభ స్పీకర్ నిర్ణయం తీసుకునేలా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా లేదా? అనే అంశాలపై వాదనలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ అంశంపై వాదనలు సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో జరిగాయి. ఏప్రిల్ 3వ తేదీన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పును జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఇవాళ న్యాయస్థానం ఈ మేరకు తుది తీర్పును వెలువరించనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేశారు.
దానం నాగేందర్ (ఖైరతాబాద్), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది.