సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు స్పీకర్‌తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం రెండు పిటిషన్లను విచారించింది.