ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణను సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, తర్వాత మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, ఇంకా తాను పాత పార్టీకే చెందినవాడినని చెప్పుకుంటూ పదవిలో కొనసాగుతున్న అంశం “ఓపెన్ అండ్ షట్ కేస్” అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇప్పటివరకు స్పీకర్ విచారణే ప్రారంభించలేదని, కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో కోర్టు గరిష్టంగా మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ గడువు చాలా కాలం కిందటే ముగిసిందని గుర్తు చేశారు. ఆపై ట్రిబ్యునల్ తరఫు న్యాయవాది ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇంత స్పష్టమైన కేసులో ఇంతకాలం జాప్యం ఎలా జరుగుతోంది? కోర్టు ఆదేశాలకు గౌరవం లేకుండా మరింత సమయం కోరడం సమంజసం కాదు” అని వ్యాఖ్యానించింది. అయితే స్పీకర్ తరఫున నాలుగు వారాల గడువు కోరగా, దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు కోర్టు చివరి అవకాశంగా ట్రిబ్యునల్‌కు సమయం ఇస్తున్నట్లు తెలిపింది.