ఈడీపై ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ 'సుప్రీం'

Supreme Bench Considered MLC Kavitha Petition Against ED. ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.

By Medi Samrat  Published on  28 July 2023 3:15 PM IST
ఈడీపై ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ సుప్రీం

ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ మేరకు కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజైన్డర్ దాఖలు చేయాలని కవితకు సూచించారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించారు. తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే. రామచందర్ రావు విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ గత మార్చి నెలలో ఆమెను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. దీంతో ఆమె విచార‌ణ‌కు హాజరయ్యారు. క‌విత‌కు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా అనే విష‌య‌మై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవిత పిటీష‌న్‌ను పరిగణలోకి తీసుకుంది.


Next Story