Telangana: రేషన్‌కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.

By -  Knakam Karthik
Published on : 14 Dec 2025 5:28 PM IST

Telangana, State Civil Supplies Department, ration card holders, Congress Government

Telangana: రేషన్‌కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్‌ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు జారీ చేసినప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్‌ సరఫరా నిలిపివేస్తామని మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. రేషన్‌ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని న్యాయధర దుకాణాలకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రం ద్వారా బయోమెట్రిక్‌ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ-కేవైసీ పూర్తైన సభ్యులకే రేషన్‌ సరఫరా కొనసాగుతుందని, లేకపోతే రేషన్‌ కోటా రద్దు అవుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనతో రేషన్‌ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. గత రెండేళ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ జరగలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన కార్డుదారులందరూ డిసెంబర్‌ 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని శాఖ ప్రకటించింది. నిర్ణీత గడువు దాటినా ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్‌ కోటా పూర్తిగా నిలిపివేయబడుతుందని హెచ్చరించారు. దీంతో రేషన్‌ డీలర్లు, వినియోగదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇదిలా ఉండగా, కొందరు కార్డుదారుల బయోమెట్రిక్‌ వేలిముద్రలు ఈ-పాస్‌ యంత్రంలో నమోదు కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

Next Story