తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తోన్న పెట్టుబడి సాయం రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మరో 10 రోజుల్లో 4 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ఆర్థిక సమస్యలున్నా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దు అని మంత్రి నాగేశ్వరరావు కోరారు. ఇక త్వరలోనే ఆయిల్ పామ్ మిల్లు ఏర్పాటు చేస్తామని, కొత్త పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
అయితే ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా, ఇకపై నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాక మూడున్నర ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రూ.4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.