బ్రేకింగ్ : సూర్యాపేటలో కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ

Stadium Gallery Collapse In Suryapet. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ‌రుగుతున్న‌ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో అప‌శృతి చోటుచేసుకుంది

By Medi Samrat  Published on  22 March 2021 2:28 PM GMT
బ్రేకింగ్ : సూర్యాపేటలో కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ‌రుగుతున్న‌ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో అప‌శృతి చోటుచేసుకుంది. స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ ఓ వైపు కుప్పకూలి పోవ‌డంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాదంలో పదుల సంఖ్యలో యువకులకు గాయాలయ్యాయి. దాదాపుగా 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంట‌నే స్పందించిన నిర్వ‌హ‌కులు గాయ‌ప‌డ్డ‌ క్షతగాత్రులను వెంట‌నే స్థానిక ఆస్పత్రికి తరలించారు.


కాగా, ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. టోర్నీ‌ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరగ‌డంతో అంతా షాక్ గుర‌య్యారు. అయితే.. జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరగడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు స్టేడియం గ్యాలరీలో కూర్చోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇదిలావుంటే.. జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు ఇప్పటివరకు ఎన్నడూ నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరగలేదు. దీంతో ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని భావించారు. ఈ క్రీడా పోటీల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, ఎంత భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది.

Next Story
Share it