తెలంగాణలో యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్లు విజయ్ కుమార్, నర్సింహారావు, జేడీఏలు ఎస్.గీత, ఆశాకుమారి, సుచరిత, బాలు, శైలజ, డీడీఎంలు చంద్రశేఖర్, కనురాజులకు బాధ్యతలు అప్పగించారు.
కాగా ఒక్కొక్క ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పంపిణీ చేసేలా ప్రత్యేక అధికారులు జిల్లాలో పర్యటించి మానిటరింగ్ చేయనున్నారు.