మహిళలకు శుభవార్త..ఉచిత బస్సు ప్రయాణానికి ఇక ఆధార్‌తో పనిలేదు

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 21 Dec 2025 6:43 PM IST

Telangana, Congress Government, free bus, Mahalaxi Scheme, TGSRTC

మహిళలకు శుభవార్త..ఉచిత బస్సు ప్రయాణానికి ఇక ఆధార్‌తో పనిలేదు

తెలంగాణలో అమలవుతోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మీ పథకంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయ‌న‌ సూచించారు.

ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి చేరినందుకు ఆనందంగా ఉంది. మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ప్రత్యేక కార్డుల పంపిణీకి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలి. తెలంగాణలో ప్రతి మహిళ ఈ సౌలభ్యం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటివరకు మహిళలు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు ఇది తెలంగాణ మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యం. ప్రజా ప్రభుత్వం ఆవిర్భావం తరువాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.1400 కోట్ల నుంచి రూ.660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించాం.

PM ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్-వరంగల్ పట్టణాలకు 100 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు వేగంగా ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ పంపిణీ జరిగేలా చూడాలి. నాయి బ్రాహ్మణ, రజక వృత్తుల సంఘాలకు ఉచిత విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేయాలి. విద్యపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసింది. గురుకులాల మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశాం. ప్రజా ప్రభుత్వం సమానత్వం, సాధికారత, అభ్యున్నతి దిశగా స్థిరంగా ముందుకు సాగుతోంది..అని భట్టి పేర్కొన్నారు.

Next Story