సూర్యాపేట‌ హత్య.. ఆమెకు చూపించిన తర్వాతే మృతదేహాన్ని పడేశారు

అనుమానాస్పద పరువు హత్య కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  29 Jan 2025 5:16 PM IST
సూర్యాపేట‌ హత్య.. ఆమెకు చూపించిన తర్వాతే మృతదేహాన్ని పడేశారు

అనుమానాస్పద పరువు హత్య కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి 32 ఏళ్ల వి.కృష్ణ హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి కృష్ణ ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అరెస్టయిన వారిలో భార్గవి నాయ‌న‌మ్మ‌ కోట్ల బుచ్చమ్మ, తండ్రి సైదులు, భార్గవి సోదరులు నవీన్, వంశీ, వారి సహచరులు మహేష్, చరణ్ ఉన్నారు.

వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడారు. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం కారణంగానే ఈ హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్‌లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. బైరు మహేష్ మూడు నెలలుగా కృష్ణతో స్నేహం చేశాడు. కృష్టను ఫోన్ చేసి బయటకు పిలిపించారు. రాత్రి తొమ్మిది గంటల‌ సమయంలో దాడి చేశారు. కృష్ణను హత్య చేశామని నవీన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని తీసుకుని పాత సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆ తర్వాత నల్లగొండకు వెళ్లి సాయిచరణ్‌కు చూపించారు. నల్లగొండ, కనగల్‌తో పాటు పలు చోట్ల మృతదేహాన్ని పడేయాలని భావించారు. చివరగా పిల్లలమర్రి చెరువు కట్టపై కృష్ణ మృతదేహాన్ని పడేశారు. గతంలో మూడుసార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేసి విఫలం అయ్యారని పోలీసులు తెలిపారు. పరువు హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Next Story