Telangana: సోనియా గాంధీని దేవతగా చూపిస్తూ పోస్టర్లు.. సిగ్గు చేటన్న బీజేపీ

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని దేవతగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేయడంతో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌పై విరుచుకుపడింది.

By అంజి  Published on  19 Sept 2023 7:45 AM IST
Sonia Gandhi, Telangana posters, BJP, Congress

Telangana: సోనియా గాంధీని దేవతగా చూపిస్తూ పోస్టర్లు.. సిగ్గు చేటన్న బీజేపీ

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని దేవతగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేయడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఆ పోస్టర్లలో సోనియా గాంధీ దేవత వేషధారణలో రత్న కిరీటాన్ని ధరించినట్లు చూపారు. ఆమె కుడి అరచేతి నుండి తెలంగాణ మ్యాప్‌ను కూడా పోస్టర్లు వర్ణించాయి. దీనిపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ కార్యకర్తల చర్య "సిగ్గుచేటు" అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. పాత పార్టీ ఎల్లప్పుడూ తమ "పరివార్" ను దేశం, దాని ప్రజల కంటే పెద్దదిగా చూస్తోందని అన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం ఈ పోస్టర్లు వెలిశాయి . రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ఎక్స్‌తో పూనావాలా, భారత్‌ను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్‌.. సోనియా గాంధీని భారత్ మాతతో సమానం చేశారు. ఇది పూర్తిగా సిగ్గుచేటు" అని అన్నారు.

''సనాతన ధర్మంలో మహిళను శక్తి రూపంగా, దేవతగా కొలుస్తాం. ప్రతి గ్రామానికి ఓ గ్రామదేవత ఉంటుంది. ఆ దేవత మన ఊలిపొలిమెరల్లో ఉండి గ్రామాన్ని కాపాడుతుంది. ప్రజలకు అవసరమైన ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది. కానీ.. కాంగ్రెస్ పార్టీ.. మన గ్రామదేవతలను, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేలా.. ఓ కుటుంబాన్ని గొప్పగా చూపించే ఆలోచనతో.. అవినీతి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిని తెలంగాణ తల్లిగా చూపించేందుకు, ఓ దేవతగా చూపించేందుకు చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

ఇదిలావుండగా సీడబ్ల్యూసీ సమావేశం తరువాత, తెలంగాణలోని తుక్కుగూడలో జరిగిన ర్యాలీలో సోనియా గాంధీ ప్రసంగించారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేసే పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో చూడాలనేది తన కల అని అన్నారు. ఈ మహత్తర రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావానికి నాతోపాటు నా సహోద్యోగులతో పాటు అవకాశం లభించిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం మన కర్తవ్యమని ఆమె అన్నారు.

Next Story