ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ ఐదు గంటలపాటు కొనసాగింది. సిట్ అధికారులు సంతోష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పంజాగుట్టలో నమోదైన కేసు ఆధారంగా కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సిట్ అధికారులు.. తాజాగా సంతోష్ రావును కూడా విచారించారు. కేసీఆర్ వెన్నంటే ఉండే సంతోష్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి.
కేసీఆర్ కూతురు కవిత ఎప్పటి నుంచో సంతోష్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల్లో సంతోష్ రావు ముఖ్యుడని.. రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడని కవిత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన ఆధారాలు ధ్వంసం చేయడంలో ఆయనకు ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో పాటు ఉండే సంతోష్ విచారణ రాజకీయంగా కీలకంగా మారింది.