ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే..! ఆయన వచ్చే రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ ఇంతకు ముందే నిర్ణయించుకుంది. అందులో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నాను చేపట్టారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ మంత్రులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. 12.00 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. 12.05 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు.