తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు.
By - Medi Samrat |
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందిన శివధర్ రెడ్డి.. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1994లో ఆయన ఐపీఎస్ సర్వీసులో చేరారు. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీగా పలు జిల్లాల్లో పనిచేశారు. 2014-16 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ ఆయన హాయంలోనే జరిగినట్టు తెలుస్తోంది.