సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు

Sharmila criticizes CM KCR. తడిసిన వడ్లు కొంటామని చెప్పిన దొర గారు.. కాంటాలు ఎప్పుడు వేస్తారో సమాధానం

By Medi Samrat  Published on  6 May 2023 3:45 PM IST
సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మ‌రోమారు విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు. తడిసిన వడ్లు కొంటామని చెప్పిన దొర గారు.. కాంటాలు ఎప్పుడు వేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్లకు మొలకలు వచ్చి రైతన్న రోదిస్తుంటే.. వడ్లు ఎప్పుడు కొంటారో తెలియక కటిక చీకట్లోనే కాపలా కాస్తుంటే.. కించింత సోయి కూడా లేదు సారుకు అని విమ‌ర్శించారు. ఒక పక్క వానలు పడుతున్నా కొనుగోలు సెంటర్లు తెరవడం లేదని.. ఇదే అదునుగా మిల్లర్లు కోతలు పెట్టి కాంటాలు వేస్తున్నా.. దొరకు జాతీయ రాజకీయాలే ముఖ్యమ‌న్నారు. మహారాష్ట్ర రైతులకు మాయమాటలు చెప్పి కండువాలు కప్పే కేసీఆర్ కు.. మన రాష్ట్ర రైతుల కష్టాలు కనపడడం లేదా? ఇకనైనా మేలుకో దొరా.. అంటూ ఎద్దేవా చేశారు. తడిసిన వడ్లు కొనడంతో పాటు ఎకరాకు రూ. 30వేల నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్? అంటూ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదు కానీ.. పక్క రాష్ట్రంలోని మీ పార్టీ వ్యక్తికి రూ.18లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా? ఆరోప‌ణ‌లు గుప్పించారు. తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కొలువులు ఏమైనా మీ ఇంట్లో.. నౌకరు పదవులా మీ ఇష్టారాజ్యంగా రాసివ్వడానికి? అందుకోసమేనా పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారు? అంటూ ప్ర‌శ్నించారు. జీవోలు దాచిపెట్టి కొలువులు కట్టబెడుతున్నారు అంటూ ఆరోపించారు. మీ పార్టీ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా? ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మీ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారా? అంటూ ప్ర‌శ్నించారు. ఇలా జీవోలను దాచిపెట్టి ఇంకా ఎంతమందికి కొలువులు ఇచ్చారు? మీ పార్టీ కార్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


Next Story