నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి ఢీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయనను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం డీ శ్రీనివాస్ కు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని తెలిపారు. తాను రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని తెలిపారు. నేడు, రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.
1948 సెప్టెంబరు 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించిన డీఎస్.. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాదు (అర్బన్) శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయనప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.