Rahul Gandhi Disqualified : భ‌గ్గుమ‌న్న సీత‌క్క‌

Seethakka Responds on Rahul Gandhi Disqualified. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.

By Medi Samrat  Published on  24 March 2023 4:23 PM IST
Rahul Gandhi Disqualified : భ‌గ్గుమ‌న్న సీత‌క్క‌

Congress MLA Seethakka



రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేశారని అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో.. ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదని అన్నారు. ఇలాంటి కేసులు, బెదిరింపులకు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వారిదని కొనియాడారు.

మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారని మండిప‌డ్డారు. ప్రశ్నించే గొంతుకలను చూసి మోదీ, బీజేపీ ప్రభుత్వం ఎందుకింత బయపడుతుంది.. ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. మొన్న బీబీసీ, నిన్న హిండెన్ బర్గ్, నేడు రాహుల్ గాంధీ. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి, స్వాతంత్య్రం కోసం ఏళ్ల తరబడి జైలు జీవితాలు అనుభవించిన కుటుంబాలు వారివి. వారికున్న సొంత ఆస్తులను, వేల కోట్ల రూపాయిలు స్వాతంత్య్రం కోసం దారపోశారని అన్నారు. దివంగత ప్రధాని ఇందిరమ్మ తన ప్రాణాలిచ్చింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని స్థానంలో కూర్చోలేదని పేర్కొన్నారు.

సింగరేణి, బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు నెలకొల్పారు. కానీ మీరు రైల్వేలు, ఎయిర్ పోర్టులు, షిప్పింగులను మీరు మీ దోస్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ దోచుకుంటుంటే అడ్డుకుంటున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. లండన్ లో మాట్లాడిన మాటలను వక్రీకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయంటే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానాన్ని మ్యానేజ్ చేసి రాహుల్ గాంధీకి శిక్షపడేలా చేసి ఎంపీగా అనర్హత వేటు వేయించారని ఆరోపించారు.

కోర్టులంటే మాకు గౌరవం ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టులు, ఎలక్షన్ కమిషన్లు, ఈడీలు, ఐటీలు, సిబిఐలను తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ తన తీర్పును ఆయా సంస్థల ద్వారా ప్రభావితం చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ చెప్పిందేమన్న పెద్ద తప్పా.. మోదీ ప్రభుత్వం హయాంలో అదానీకి 12 లక్షల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని ప్ర‌శ్నించారు. పాకిస్తాన్ కంటే మన ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోయిందని లోకం కోడై కూస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రజాస్వామ్యంలో ఖూనీ చేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాహుల్ గాంధీపై కక్షసాధింపు చర్యేన‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై చేస్తున్న ఇటువంటి కక్షసాధింపు చర్యలు మోదీ ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఏదైతే హిండెన్ బర్గ్ చెప్పిందో ఆదానీ ఆస్తులపై పార్లమెంట్ జాయింట్ కమిటి వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలను ఏర్పాటు చేసింద‌ని సీత‌క్క అన్నారు.


Next Story