బీజేపీ.. బలిసినోళ్ళ పార్టీ, కాంగ్రెస్.. కన్నీళ్లు తుడిచే పార్టీ

MLA Seethakka Fire On Center. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుద‌ల‌, జీఎస్టీ పెంపు, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు

By Medi Samrat  Published on  5 Aug 2022 8:45 AM GMT
బీజేపీ.. బలిసినోళ్ళ పార్టీ, కాంగ్రెస్.. కన్నీళ్లు తుడిచే పార్టీ

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుద‌ల‌, జీఎస్టీ పెంపు, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెరుగుద‌ల‌, నిరుద్యోగం, అగ్నిపత్ పేరుతో సైనికులను అవమాన పరచడం, రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లాంటి చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. కార్య‌క్ర‌మంలో భాగంగా ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన‌ ధర్నాలో ఎమ్మెల్యే సీత‌క్క మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాలను కులగొట్టడం తప్ప.. 8 సంవత్సరాల్లో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని విమ‌ర్శించారు.

బీజేపీ అంటే పేదల నడ్డి విరచడం, దోచుకోవడం అని అన్నారు. బీజేపీ బలిసినోళ్ళ పార్టీ.. కన్నీళ్లు తుడిచే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. పిల్లలు తినే వస్తువులపై కూడా జీఎస్టీ తెచ్చారని మండిప‌డ్డారు. సామాన్యులకు సబ్సీడీ, సంక్షేమం తప్పని బీజేపీ ప్రభుత్వం చెప్తుందని.. ఉపాధిహామీ చట్టం తెచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. సోనియాను ఈడీ పేరుతో వేధిస్తున్నారని విచారం వ్య‌క్తం చేశారు.

మోదీ ఎక్కడ దేవుడు.. రాముడుని అందరూ పూజిస్తారు.. కానీ రాముడు అంటే బీజేపీ అన్న విధంగా మార్చారని.. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి వసూలు చేశారని మండిప‌డ్డారు. కరోనా కష్టంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రేట్లు పెంచారని.. ఈ 8 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారని.. మీకు దేశాన్ని ఏలే నైతిక అర్హత లేదని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ప్రశ్నించే గొంతులు జైలు పాలవుతున్నారని.. స్వాతంత్ర పోరాటంలో మీ చరిత్ర ఏంది..? అని ప్ర‌శ్నించారు. ముక్త్ కాంగ్రెస్ అంటున్నారు.. కాంగ్రెస్ మీకు ఏం అన్యాయం చేసిందని నిల‌దీశారు. బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు.. మీ సావర్కర్ లాంటి వారు.. ఆత్మగౌరవాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర తాకట్టుపెట్టారని సీత‌క్క ఫైర‌య్యారు.


Next Story
Share it