ఇక జ్ఞాపకమే.. వందేళ్ల నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూల్చివేత

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి.

By Knakam Karthik  Published on  14 Feb 2025 2:49 PM IST
Telugu News, Telangana, Hyderabad, Secunderabad, Railway Station, SouthCentralRailway

ఇక జ్ఞాపకమే.. వందేళ్ల నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూల్చివేత .

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. సికింద్రాబాద్‌ అంటేనే గుర్తుకు వచ్చేది మొదటగా రైల్వే స్టేషన్‌ భవన నమూనానే. సిటీకి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీంతో నాటి కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది.

వందేళ్లకుపైగా చరిత్ర కలిసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చి వేస్తున్నారు. 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఇది 1916 వరకు నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్)కు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ, స్వాతంత్య్రం అనంతరం 1951లో ఎన్జీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ భాగమైంది. దీంతో 1952లో ఈ రైల్వే స్టేషన్‌ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.

కాగా సికింద్రాబాద్ నూతన రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.720 కోట్ల వ్య‌యంతో సికింద్రాబాద్ స్టేష‌న్ ను అధునీక‌రిస్తున్నారు. మరో ఏడాదిలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎయిర్‌పోర్టును తలపించేలా మారనుంది. చేపట్టిన స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐకానిక్ భ‌వ‌నాన్ని శుక్రవారం కూల్చివేశారు. శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా దశలవారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును ప్రారంభించారు.

Next Story