ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ప్రూఫ్ ఎక్కడ అని అడిగిన సుప్రీం కోర్టు..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీలపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది
By Medi Samrat Published on 5 Oct 2023 2:56 PM GMTఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీలపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చూపించాలని సుప్రీంకోర్టు కోరింది. అంతేకాకుండా కేంద్ర ఏజెన్సీలపై పలు ప్రశ్నలు సంధించింది. అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేష్ అరోరా స్టేట్‌మెంట్ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. నగదు ఎవరి నుండి ఎవరికి ఎలా చేరిందనే అంశంపై పూర్తి సాక్ష్యాధారాల లింకులను సమర్పించలేదని తెలిపింది. లిక్కర్ గ్రూపుల నుండి మనీస్ సిసోడియాకు ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థ పేర్కొందని, అయితే ఆ నగదు ఎలా చేరిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
మీరు రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు అంకెలు చెప్పారు. వారికి ఇది ఎవరు చెల్లించారు. నగదు చాలా మంది చెల్లించవచ్చు. మద్యానికి సంబంధించినదే కానవసరంలేదు. సాక్ష్యం ఎక్కడ ఉంది. దినేష్ అరోరా కూడా నగదు తీసుకున్న వ్యక్తే.. ఒక్క దినేష్ అరోరా ప్రకటన తప్ప.. ఈ కేసులో సరైన రుజువులు ఏవని జస్టీస్ ఖన్నా ప్రశ్నించారు. ఈ కేసులో విజయ్ నాయర్ మాత్రమే ఉన్నారని, మనీష్ సిసోడియా పాత్ర లేదని ధర్మాసనం ప్రశ్నించింది. మనీలాండరింగ్ చట్టం కింద సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించలేమని తెలిపింది.