రోడ్డుపై కరెన్సీ నోట్ల తుక్కు కుప్పలు కుప్పలుగా కనిపించడం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మెండోరా మండలం బుస్సాపూర్ దగ్గర హైదరాబాద్ - నాగపూర్ నేషనల్ హైవేపై ఈ నోట్ల తుక్కు కనిపించింది. అయితే ఈ కరెన్సీ నోట్లు లారీ నుంచి కింద పడ్డట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లారీలో నుండి కింద పడిన సంచిలో కరెన్సీ నోట్లు ఉన్నాయని, ఆ సంచిపై పలు వాహనాలు వెళ్లడంతో తుక్కుగా మారి రోడ్డుపై చెల్లాచెదరుగా పడ్డాయని స్థానికులు అంటున్నారు. తుక్కుగా కనిపించిన నోట్లు అసలైనవా? నకిలీ నోట్లా ? ఎక్కడికి తరలిస్తున్నారని, ఎందుకు తరలిస్తున్నారని, తుక్కుగా ఎందుకు మార్చారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మాములుగా అయితే పాత నోట్లను రహస్య ప్రదేశంలో కాల్చి వేస్తుంది. ఇలా నోట్లను తరలించదు కాబట్టి.. అది నల్లధనమో లేదా నకిలీ నోట్లో అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అవి ఏ వాహనం కింద పడ్డాయో తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు.