తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చి నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను మంత్రి పొన్నం దృష్టికి సంఘాల నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా.. ఎప్పుడైనా తనను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా..అని మంత్రి పొన్నం ఆర్టీసీ సంఘాల నేతలకు స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమస్యలను వినడానికి నేను కానీ, మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికీ ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సమస్యలు తొలుగుతున్నాయి. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా...అని మంత్రి పేర్కొన్నారు.
ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒక్కటైనా ఇబ్బందిపెట్టామా? ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ఆర్టీసీ నిర్వీర్యం చేసింది. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు. సీసీఎస్, పీఎఫ్ నిధులు వాడుకున్నారు...అని మంత్రి పొన్నం ఆరోపించారు.