సీఎంకు పోలీస్ శాఖపై శ్రద్ధ లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు

By Medi Samrat  Published on  25 Oct 2024 9:07 AM GMT
సీఎంకు పోలీస్ శాఖపై శ్రద్ధ లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..గ్రూప్-1 అభ్యర్థులు జీవో 29కి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని.. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకూ వెళ్ళిందన్నారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగబద్దంగా వస్తుందనే నమ్మకం మాకుంది. బ్యాక్ లాగ్ పోస్టులు ఉండవని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని.. గ్రూప్-4లో ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్‌కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏక్ పోలీస్ నినాదం ఇచ్చారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదని అన్నారు.

నల్గొండలో పోలీసుల‌ కుటుంబ సభ్యులను కొట్టుకుంటూ తీసుకువెళ్లారన్నారు. సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 29పై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. తమిళనాడు, కర్ణాటకలో అమలు చేస్తున్న ఏక్ పోలీస్ నినాదాన్ని తెలంగాణలో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు రోడ్డు ఎక్కారన్నారు. ఒకే కేసుపై రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లలో ఎఫ్.ఐ.ఆర్ లు పెడుతున్నారన్నారు. పెట్రోల్ పోసి చంపుతానని మైనంపల్లి అంటే ఇంతవరకూ కేసు నమోదు చేయలేదన్నారు. పోలీసులే అరికేపూడి గాంధీని తీసుకువచ్చి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారన్నారు.

Next Story