లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నారని, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
తన కుమారుడికి తన అవసరం ఉందని పేర్కొంటూ ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కూడా కవిత కోరారు. లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న వాయిదా వేసారు.