అబార్షన్ చేస్తున్న దృశ్యాలు వైరల్.. అయన ఇల్లే అడ్డా..!
RMP Doctor Doing Abortion In Mahabad District. మహబూబాబాద్ జిల్లా నెల్లికూదురు మండలం వావిలాల గ్రామ శివారు బోటిమీది తండా
By Medi Samrat Published on 20 Feb 2021 12:53 PM IST
మహబూబాబాద్ జిల్లా నెల్లికూదురు మండలం వావిలాల గ్రామ శివారు బోటిమీది తండా అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్షరం ముక్కరాని వారే అక్కడ డాక్టర్ అవతారమెత్తి కత్తెరలతో కసాయి వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల ఆశతో భ్రూణ హత్యలకు ఒడిగడుతున్నారు. ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు వావిలాల సమీపంలోని బోటిమీది తండాకు చేరుకుని విచారణ చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల శివారు బోటిమీది తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు సంతోష్ ఇల్లు అబార్షన్లకు అడ్డాగా మారింది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అబార్షన్‌లు చేస్తున్నారు. సంతోష్ కొద్ది కాలం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో ఓ నర్సు పరిచయమైంది. వీరిద్దరు మరో ముగ్గురితో కలిసి పలు ప్రాంతాల్లో తిరుగుతూ గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌లు చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాత్రివేళ ఓ మహిళను కారులో తీసుకొచ్చి సంతోష్ ఇంట్లో అబార్షన్ చేశారు. అబార్షన్ చేస్తున్న దృశ్యాలు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని చైల్డ్‌లైన్ సిబ్బంది... కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కఠిన చర్యలకు ఆదేశించారు. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని నర్సింగ్ హోమ్ నిర్వాహకులకు అవగాహనా సదస్సును నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. భ్రూణ హత్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధనార్జనే ధ్యేయంగా అబార్షన్ దందాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.