సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy's open letter to CM KCR. రాష్ట్రంలో భారీ వర్షాలకు సంభవించిన పంట నష్టం గురించి టీపీసీసీ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  12 July 2022 1:00 PM GMT
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్రంలో భారీ వర్షాలకు సంభవించిన పంట నష్టం గురించి టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితిని గూర్చి వివ‌రించారు. ఈ మేర‌కు ప‌లు డిమాండ్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు నీట మునిగి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జోరువానతో.. అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి గానీ, వ్యవసాయ విభాగం నుంచి గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది.

ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో ఆదిలాబాద్, నిజామాబాద్‌, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పత్తి, మక్క ,సోయా, వరితో పాటు పునాస పంటలపై వర్షాల ప్రభావం పడింది. వర్ష విలయానికి రైతులు నష్టపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగి పోతున్నాయి. వరదకు కొట్టుకుపోతున్నాయి.

విత్తనాలు మొలక స్థాయిలోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తకుండా వర్షాల వల్ల మురిగిపోతున్నాయి. మొలక వచ్చినవి కూడా పొలంలో నీరు నిలవడంతో చనిపోతున్న పరిస్థితి. ఈ సీజన్లో ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అధికారుల సూచనల ప్రకారం రైతులు వెదజల్లే వరి సాగుకు మొగ్గు చూపారు. వానలకు వరి విత్తనాలు మురిగిపోయి మొలకలు రావడం లేదు. ఫలితంగా మళ్లీ విత్తనాలు వేయడమో, నారు పోసుకుని నాట్లు వేయడమో చేయాల్సిన పరిస్థితి.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టం జరగడం పరిహారం అందక ఉసూరుమనడం రైతాంగానికి పరిపాటిగా మారింది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతుంటే వారిని ఆదుకునే పథకం ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఇది రైతుల పట్ల మీ కపట ప్రేమకు నిదర్శనం. 2015 నుంచి పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌‌పుట్‌‌ సబ్సిడీ ఇవ్వడం మానేసింది. పంట నష్టం సైతం అంచనా వేయడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంది. పీఎంఎఫ్బీవై పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు ప్రత్యామ్నాయ బీమా పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నాయి. అటువంటి వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరం.

ప్రభుత్వాల చేయూత లేకుండా రైతులు స్వయంగా పంటల బీమా తీసుకునే పరిస్థితి లేకపోవటంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే విధంగా తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిమాండ్లు..

• భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలి.

• తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.

• కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలి.

• తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.
































Next Story