సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Wrote Letter To CM KCR. ఇటీవల కురిసిన‌ భారీ వర్షాలకు పంట నష్టం - పరిహారం గురించి పీసీసీ ఛీప్‌ రేవంత్ రెడ్

By Medi Samrat  Published on  26 July 2021 10:11 AM GMT
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఇటీవల కురిసిన‌ భారీ వర్షాలకు పంట నష్టం - పరిహారం గురించి పీసీసీ ఛీప్‌ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రైతుల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది. ప్రకృతి కరుణతో మంచి వర్షాల కురుస్తూ పంటలు బాగా పండుతాయని ఆశిస్తోన్న తరుణంలో భారీ వర్షాలతో ఊహించని నష్టం జరిగింది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో పంట నష్టం తీవ్రంగా ఉంది. పంట నీట మునిగి, పెట్టిన పెట్టుబడి సర్వం కోల్పోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి, క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకునేవి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవు. ఇది చాలదన్నట్టు పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళం పాడారు.

జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో వర్ష బీమా - 2021 పేరుతో అమలు చేస్తోన్న పథకంలో కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితం అయింది. ఆ పంటలకు కూడా బీమా ప్రీమియం పూర్తిగా రైతులే చెల్లుంచుకోవాల్సిన పరిస్థితి. ఓవైపు వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డీజిల్ పై వేస్తోన్న పన్నుల భారం పరోక్షంగా వ్యవసాయ పెట్టుబడుల పై ప్రభావం చూపుతోంది.

బీమా ప్రీమియం రైతులే చెల్లించుకుకోవాల్సి రావడం, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటడం, కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయి. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో బ్యాంకుల్లో రైతుల అప్పు అలాగే ఉంది. రైతుబంధు సొమ్ములు ఆ బాకీకి వడ్డీగా జమవుతూనే ఉన్నాయి. రుణం మాఫీ కాకపోవడం, మాఫీ అవుతుందని రైతులు బాకీ చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేదు.

దీంతో మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై రైతుల ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మూగిలే నక్కపై తాడిపండు పడిన చందంగా భారీవర్షాలతో జరిగిన పంట నష్టం రైతులను కోలుకోలేని పరిస్థితికి నెట్టేసింది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే.. మీరు మాత్రం 24 గంటలూ హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు కోసం ఎత్తులు జిత్తులు వేసుకునే పనిలో మునిగిపోయారు. మూడు వేల కోట్లు ఖర్చు చేసైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న మీకు రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోడవం శోచనీయం.

భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్ర‌భుత్వ‌ నిర్లక్ష్యమే కారణం కాబట్టి.. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు వెంట‌నే చర్యలు తీసుకోవాలని.. తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్ లేఖ‌లో డిమాండ్ చేశారు.


Next Story