తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్‌రెడ్డిని ఓ వర్గం టార్గెట్ చేస్తూనే ఉంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంతో మంది ఎన్నో సార్లు తమ గళం వినిపించారు. వారిని రేవంత్ రెడ్డి చూసి చూడనట్లు వదిలేశారు. అయితే తాజాగా అలాంటి వాళ్లకు హెచ్చరికలు పంపారు. పార్టీ రూల్స్‌ను అతిక్రమించే కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న కార్యకర్తలపై అధ్యక్షుడు మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్లపై ఇక ధర్నాలు చేస్తే సస్పెండ్ చేస్తామని రేవంత్ హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని నాయకులకు రేవంత్ ఆదేశించారు. కార్యకర్తలకు సమస్య ఉంటే వినతి పత్రం ఇవ్వాలన్నారు. అంతేకాని పార్టీ ఆఫీసులో ధర్నాలు చేస్తే మాత్రం పార్టీ వ్యతిరేక చర్యగా చూస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేయాలని సంబంధిత నాయకులకు రేవంత్ ఆదేశించారు.
పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు. శనివారం కూడా గాంధీ భవన్‌కు రేవంత్ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని నేతలకు రేవంత్ ఆదేశించారు.