కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. ట్విట్టర్ లో ఎక్కడి దాకా వెళుతుందో..!

Revanth Reddy vs Minister KTR. ప్రతిపక్ష పార్టీలపై ఇటీవలే తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By M.S.R  Published on  20 Sep 2021 4:38 AM GMT
కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. ట్విట్టర్ లో ఎక్కడి దాకా వెళుతుందో..!

ప్రతిపక్ష పార్టీలపై ఇటీవలే తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని తిడితే బట్టలూడదీసి కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రాన్ని పొగిడితే జాతీయ నాయకున్ని గాడిద అన్న రేవంత్ రెడ్డి.. అడ్డ గాడిదనా.. నిలువు గాడిదనా అంటూ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసుకుంటూ, గ్రామాలు తిరుగుతూ ఒకాయన పాదయాత్ర చేస్తుంటే.. ఇంకొకాయన మార్కెట్‌లోకి కొత్తగా వచ్చి హడావుడి చేస్తున్నాడని, మార్కెటింగ్ చేసుకుంటున్నాడని బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు. డ్రగ్స్ అంశంపై కూడా మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తనను డ్రగ్స్‌కు అంబాసిడర్ అని కొందరు అంటున్నారని, వాళ్లు అసలు మనిషేనా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ''నా రక్త నమూనాలు, లివర్ టెస్ట్ ఇస్తా.. దమ్ముంటే మీ రాహుల్ గాంధీ కూడా వస్తాడా?'' అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరాడు.

ఇక ట్విట్టర్ లో కూడా డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ లో గొడవ జరుగుతూ ఉంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.... మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్...''నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను...రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?...ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ...ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?...రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా'' అని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.



Next Story