సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే..
Revanth Reddy Speech In Pasra Meeting. కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని
By Medi Samrat Published on 6 Feb 2023 2:13 PM GMTకులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంబించిన రేవంత్ రెడ్డి.. పస్రా సభలో మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని.. అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని అన్నారు. రాహుల్ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించింది. మేడారం నుంచే ఈ యాత్ర మొదలు పెట్టడానికి ఒక కారణం ఉంది. సమ్మక్క సారలమ్మ వనదేవతలు.. నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారని.. అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యాం అని తెలిపారు.
అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికేనని వ్యాఖ్యానించారు. వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే.. ఈ యాత్ర విజయవంతం అయినట్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోంది. తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోంది. అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టి కప్పాలని చూస్తోందని ఆరోపించారు.
కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన సమ్మక్క సారక్క పోరాడిన గడ్డ ఇది.. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇది. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా? అని ప్రశ్నించారు.
నోటిఫికేషన్లు వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పెదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా? అని నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా.? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? 25లక్షల కోట్లు ఎటు పోయాయి? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారని విమర్శించారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? అని ఫైర్ అయ్యారు. రైతులు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర అని తెలిపారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి.. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.