కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్

Revanth Reddy Slams CM KCR. మలి ద‌శ‌ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు

By Medi Samrat  Published on  28 Feb 2023 2:24 PM IST
కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్

తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం.. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారని.. మలి ద‌శ‌ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం విద్యార్థులతో మాట ముచ్చట కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదని.. విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని ఆడపడుచు గోడు వినిపించారని విచారం వ్య‌క్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నామ‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని మరో ఆడబిడ్డ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. మీ అందరితో మాట్లాడాక రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గలికొదిలేసారని అర్థమైందని అన్నారు.

కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్.. అని అన్నారు. దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ అని తెలిపారు. బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని వెల్ల‌డించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను మోదీ ప్రయివేటుకు అప్పగించారు. లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నారని.. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని ఖండించారు.

ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే.. రిజర్వేషన్లు అమలు జరగదు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 30వేల స్కూల్స్ తెరిస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో 6,354 సింగిల్ టీచర్ పాఠాశాలలు మూసేశారు. దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైందని అన్నారు. కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారు.. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమ‌ర్శించారు. ప్రయివేటు యూనివర్సిటీలు తెరిచి విద్యను వ్యాపారం చేస్తున్నారు.. ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని అన్నారు.

బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పింది.. కానీ రిటైర్ మెంట్ వయసు పెంచి ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని.. అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కాంగ్రెస్ విధానం తీసుకొస్తుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరతాం అని అన్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. శాఖలవారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తామ‌న్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 శాతం పైగా నిధులు విద్య కోసం ఖర్చు చేస్తాం. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి హాస్టళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతాం అని పేర్కొన్నారు.

రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచిందని విమ‌ర్శించారు. అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేసి రైతులను ఆదుకుంటామ‌ని తెలిపారు. ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ దృష్టిలో వాళ్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చుకునుడని.. రాచరికపు పోకడలను ఇంకెంత కాలం భరిద్దాం? అని ప్ర‌శ్నించారు. విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. విద్యార్థులు అనుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండని రేవంత్ రెడ్డి కోరారు.


Next Story