పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Sensational Comments On TRS Mlas. దళిత గిరిజనులపై తెలంగాణ, పాలమూరు గడ్డ దొరలు ఇంకా కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని

By Medi Samrat  Published on  22 Jan 2023 8:33 PM IST
పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు : రేవంత్ రెడ్డి

దళిత గిరిజనులపై తెలంగాణ, పాలమూరు గడ్డ దొరలు ఇంకా కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూశారని.. భూస్వాములు, దొరలు దళితులపై దాడులు చేస్తుంటే వారిని దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బిజినపల్లిలో జ‌రుగుతున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళితే నాగం జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టారు. నాలుగేళ్లయినా ఇక్కడ కడతామన్న ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. హామీలు నిలబెట్టుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లారని తెలిపారు.

పాలమూరును పచ్చగా చేయాలని కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టింది. జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్ర‌శ్నించారు. మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నాడు. పంచెలు కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అనిస‌వాల్ విసిరారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదని విమ‌ర్శించారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. దరిద్రుడు సీఎం అయిండని తీవ్ర‌స్తాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన సీఎం .. ఏమీ చేయలేదు.. పైగా దళిత గిరిజనుల గొంతుపై కాలు పెట్టి తొక్కిస్తున్నాడు.. దళిత గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకొం అని హెచ్చ‌రించారు. ఎన్నికలొస్తున్నాయ్ బిడ్డా.. నీ నడి నెత్తిపై కాలు పెట్టి తొక్కి జనం నిన్ను పాతాళంలోకి పంపిస్తారని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. గతంలో నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డికి చిప్ప కూడే గతి అయిందని.. ఇప్పుడు ఇక్కడున్న ఈ తిర్రి జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే.. శిశుపాలుడికి పట్టిన గతే ఈ తిర్రికి పడుతుందని విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్రంలో దళిత గిరిజనులను బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని.. దళిత గిరిజనులకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందని భ‌రోసా ఇచ్చారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంటే.. దళిత గిరిజనులకు కాంగ్రెస్ ఉందని అన్నారు. ఈ పార్టీ మీది.. ఈ జెండా మీది.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు.

దళితుల ఉద్యోగాలు తీసి, మంద కృష్ణ మాదిగను జైలులో పెట్టిండు కేసీఆర్.. పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది.. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది అని రేవంత్‌ అన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.


Next Story