కేసీఆర్‌కు కాళేశ్వరం.. కేటీఆర్‌కు టీఎస్‌పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయి : రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ఉద్యమిస్తూనే ఉన్నామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  1 Oct 2023 2:08 PM IST
కేసీఆర్‌కు కాళేశ్వరం.. కేటీఆర్‌కు టీఎస్‌పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయి : రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ఉద్యమిస్తూనే ఉన్నామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని ఆరోపించారు. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించింద‌ని.. గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారు? అని ప్ర‌శ్నించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు.

నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవని అన్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని ప్ర‌శ్నించారు. అవకతవకలపై ఐటీ మంత్రిని అని చెప్పుకుంటున్న కమీషన్ల తారక రామారావు ఏం సమాధానం చెబుతారు? అని నిల‌దీశారు. అయ్యకు కాళేశ్వరం.. కొడుక్కు టీఎస్పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించింది.హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివ‌ర్ణించారు.

పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెల‌కొంద‌ని.. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం పై లేదా? అని ప్ర‌శ్నించారు. టీఎస్పీఎస్సీ పరిణామాలపై సీఎం ఎందుకు సమీక్ష చేయలేదు? అని నిల‌దీశారు. ఈ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయింది. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేద‌ని మండిప‌డ్డారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతుంది. త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్... నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని దుయ్యబ‌ట్టారు. ఎందుకు ప్రతిపక్షాలను సచివాలయానికి రానివ్వడం లేదు? ప్రగతి భవన్ లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదు? అని ప్ర‌శ్నించారు.

టీఎస్పీఎస్సీ రద్దు కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కమీషన్ల కేసీఆర్ అని ధ్వ‌జ‌మెత్తారు. రాజకీయ ఖాళీలు భర్తీ చేసే కేసీఆర్.. ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయరు? అని నిల‌దీశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడిన కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల నిరసనతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేయాలన్నారు.

కోదండరాం చెప్పినట్లు రహదారుల దిగ్బందానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పాలమూరు జిల్లాలో రహదారుల దిగ్బంధం చేసే బాధ్యత నేను, సంపత్ తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేస్తామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌ని పేర్కొన్నారు. కోదండరాం నేతృత్వంలో ముందుండి తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తుది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు.

Next Story