సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy Remembers Jaipal Reddy Services. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్ లో టీపీసీసీ అధ్యక్షులు

By Medi Samrat  Published on  28 July 2021 12:06 PM IST
సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం : రేవంత్ రెడ్డి

దివంగ‌త‌ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. రేవంత్ వెంట వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని అన్నారు.


కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేసింది జైపాల్ రెడ్డేన‌ని.. హైదరాబాద్ కు మెట్రోరైలు రావడానికి కారణం జైపాల్ రెడ్డి కృషినే కార‌ణ‌మ‌ని రేవంత్ అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మారువలేనివని గుర్తుచేశారు. రాజకీయాలలో మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాజకీయాల్లో ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైందని.. సోనియూ గాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ సాధన అయ్యేలా చేసిన గొప్ప నాయకులని రేవంత్ వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ లో ఆచరించి అభివృద్ధి చేయాలని కోరారు. జైపాల్ రెడ్డి తెలంగాణలో పీవీ నర్సింహారావు తర్వాత మాట్లాడుకోవాల్సిన మహనీయులు.. గొప్ప వైతాళికులని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.


Next Story