టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి మధ్య మాటల యుద్ధం ఎప్పటి నుండో సాగుతూ ఉంది. అయితే తాజాగా అసెంబ్లీ ఆవరణలో వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఇద్దరూ కలిసి సీఎల్పీలోకి వెళ్లగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. '' జగ్గారెడ్డికి, నాకు మధ్య జరిగేది తోడికోడళ్ల పంచాయితీనే. పొద్దున తిట్టుకుంటం. మళ్లీ కలిసిపోతాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు. '' రేవంత్ పాదయాత్రకు నా మద్దతుపై త్వరలో ప్రకటన చేస్తా. ఇంకా పదేళ్లు అయినా రేవంత్ దిగిన తర్వాతనే నేను పీసీసీ అవుతా. రేవంత్ ను దింపి పీసీసీ కావడం సాధ్యం కాదు'' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ మధ్య జరిగేది పట్టించుకోవాల్సిన అవసరంలేదని, తమది తోడికోడళ్ల పంచాయితీ అని అన్నారు. ఒక ఇంట్లో ఉండే తోడికోడళ్లు ఎన్నో అనుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతారు, తాము కూడా అంతేనని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే మీడియా వ్యక్తులు మీలో పెద్దకోడలు ఎవరని ప్రశ్నించగా, ఇప్పుడు కలిశామో లేదో అప్పుడే తామిద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోందంటూ రేవంత్ అన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను రేవంత్ గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని స్పష్టం చేశారు. ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడే అలవాటు తనకు లేదని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనని చెప్పారు.