రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్‌గా మార్చేసే కుట్రకు కేసీఆర్ కుటుంబం పూనుకుంది

Revanth Reddy Press Meet Over Drugs Case. డ్రగ్స్ వ్యవహారంపై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్య‌వ‌హారంలో నా కుటుంబ సభ్యుల

By Medi Samrat  Published on  5 April 2022 8:54 AM GMT
రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్‌గా మార్చేసే కుట్రకు కేసీఆర్ కుటుంబం పూనుకుంది

డ్రగ్స్ వ్యవహారంపై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్య‌వ‌హారంలో నా కుటుంబ సభ్యులను తప్పించాలని కోరానా అని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి పట్టుకున్న వారి సాంపిల్స్ ఎందుకు సేకరించలేదని అడిగారు. ఈ వ్య‌వ‌హారంలో నా కుంటుంబీకులు ఎవరున్నా సరే.. నా పిల్లల రక్త నమూనాలు, వెంట్రుకలు స‌హా అందరికి అన్ని పరీక్షలు చేయిస్తాన‌ని తెలిపారు. సమాజంలో ప్రజలను కాపాడాల్సిన నైతిక బాధ్యత నాపై ఉందని అన్నారు.

నేను నా బందువుల నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని.. 142 మందిని అదుపులోకి తీసుకుని శాంపిల్స్ తీసుకోలేదంటే.. మీరు ఎవరినో తప్పించడానికి చూస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమ‌ర్శించారు. నా మేనల్లుడిని డ్రగ్స్ తీసుకున్నాడా.. లేదో తెలుసుకునేందుకు సాంపిల్స్ కోసం పంపిస్తా.. కేసీఆర్ కేటీఆర్ ను పంపిస్తారా అని స‌వాల్ విసిరారు. డ్రగ్స్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చేసే కుట్రకు కేసీఆర్ కుటుంబం పూనుకుందని విమ‌ర్శించారు.

అన్ని విచారణలకు సిద్ధంగా ఉన్నామ‌ని.. చదువుకునే పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ కోరుతున్నామ‌ని అన్నారు. సీబీఐ ఈడీతో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై కోర్టును సైతం ఆశ్రయించాన‌ని.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసాన‌ని.. డ్రగ్స్ వ్యవహారం పై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని పోరాడింది నేనే అని గుర్తుచేశారు.

ఈడీకి పూర్తి సమాచారం బదిలీ చేయాలనీ ఆదేశాలు వచ్చినా అది జరగలేదని.. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై కేటీఆర్ పట్టు సాధించారని ఆరోప‌ణ‌లు గుప్పించారు. డ్రగ్స్ కేసు అడ్డుపెట్టుకుని సినీరంగం నుంచి అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 24 గంటల మద్యం అనుమతి ఇచ్చింది ప్రభుత్వమేన‌ని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మాదకద్రవ్య వ్యాపారాలపై 2017లోనే హైకోర్టులో పిటిషన్ వేశానని.. రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియాపై స్వచ్ఛంద సంస్థలతో ఎంక్వైరీ చూపించాలని కోరానని అన్నారు.

2017 లో సినిమా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాతనే కేటీఆర్‌తో సినిమా వాళ్ళు దగ్గరయ్యారని అన్నారు. 2017 కు ముందు కేటీఆర్ కి సినిమా వాళ్ళు ఎవరు పరిచయం లేదని.. ఈ కేసును అడ్డం పెట్టుకుని కేటీఆర్ సినిమా వాళ్లతో సన్నిహితంగా ఉంటున్నాడ‌ని ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేన‌ని అన్నారు. ఈ అంశంపై త్వరలో కోర్టుకి వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో దొరికిన వారి మొబైల్ ఫోన్స్ ల్యాప్‌టాప్‌, వీడియో క్లిప్స్ సీజ్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు.

నా బంధువుల పేర్లు ఎవరైతే పేర్లు బయటికి వచ్చాయో వారి నమూనాలను ఇప్పిస్తానని.. అసలు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలి పెట్టి, మా పిల్లలపై ఆరోపణలు చేయడం ఏంటి అని ప్ర‌శ్నించారు. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని నాపై రాజకీయం చేయడం ఏంటి.. శిఖండి రాజకీయాలు చేయకండని విమ‌ర్శించారు.


Next Story
Share it