నా హయాంలోనే కొడంగల్ అభివృద్ధి : రేవంత్

Revanth Reddy On Kodangal Development. కొడంగల్ లో తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  26 Sep 2022 3:30 PM GMT
నా హయాంలోనే కొడంగల్ అభివృద్ధి : రేవంత్

కొడంగల్ లో తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగేళ్లలో అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్లమెంటు కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, గోకుల్ నగర్,సీతనాయక్ తండా నుంచి యువకులు కాంగ్రెస్ లో చేరారు. టీఆరెస్, బీజేపీ నుంచి వచ్చిన 60 మందికి కండువా కప్పి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఏ మారుమూల పల్లెలో అడిగినా చెబుతారన్నారు రేవంత్. నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సదుపాయాలను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కల్పించినవే అని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా కొడంగల్ లో టీఆరెస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు తాను సంతకం పెడితే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, అలాంటి గొప్ప అవకాశాన్ని కొడంగల్ ప్రజలకు సోనియా గాంధీ కల్పించారన్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడ తనకు పేరు వస్తుందోనని.. కేసీఆర్, మోదీ కలిసి కృష్ణా- వికారాబాద్ రైలును కొడంగల్ కు రాకుండా ఆపారని ఆరోపించారు. తన హయాంలో నియోజకవర్గంలో 21 సబ్ స్టేషన్ లు, అయిదు వేల ట్రాన్స్ ఫార్మర్లు గ్రామ గ్రామాన ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ కు ఎంతో గౌరవం తీసుకొచ్చానని.. డ్రామారావు మాటలు నమ్మి టీఆరెస్ ను గెలిపిస్తే ఏం జరిగిందో ఆలోచించాలని కోరారు. నియోజకవర్గంలో టీఆరెస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లు పైరవీకారులకు అడ్డాగా మారాయని ఆరోపించారు. కొత్త మండలాల ఏర్పాటు డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

ఎవరో మనకు కొత్త మండలాలు ఇవ్వడం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేసుకుందామని చెప్పారు. కొడంగల్ ప్రజలు ఈ విషయంపై ఆలోచించి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి కొడంగల్ గౌరవాన్ని నిలబెట్టాలని ఆయన కోరారు.


Next Story
Share it