మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై పట్టించుకోవడం లేదంటూ..

Revanth Reddy Letter To Minister KTR. తెలంగాణ మునిసిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  7 Feb 2022 4:48 PM IST
మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై పట్టించుకోవడం లేదంటూ..

తెలంగాణ మునిసిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లేఖ‌లో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాలకు సంబంధించి ఆధారాలను లేఖకు జత చేశారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని లేఖ‌లో ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని.. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవని అన్నారు. టీఆర్ఎస్‌ నాయకులు చేస్తున్న అక్రమాలను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు.. మీకు చేత‌కాకనా.. లేక అందులో మీకు వాటాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు.

జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేసి అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారు.. ఇది అంత ఆషామాషీ విషయమా.? అని నిలదీశారు. ఫీర్జాది గూడలో మీ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారు. దేవర యాంజల్ 437 సర్వే నెంబర్ లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికలు నడుపుతున్నారు. ఇలా గ్రేటర్ లో మీ నాయకులు చేసిన కబ్జాలు కోకొల్లలు. అనేక అక్రమాలకు సంబంధించి పత్రికలలో పతాక శీర్షికలు వచ్చాయి. ఈ విషయాలు మీరు మునిసిపల్ శాఖ మంత్రిగా స్పందించి చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించాలని లేఖ‌లో కోరారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన మేమే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతామ‌ని హెచ్చ‌రించారు రేవంత్ రెడ్డి.


Next Story