ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy letter to CM KCR. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Medi Samrat Published on 28 Dec 2022 8:23 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో 12, 751 గ్రామ పంచాయతీ లలో సర్పంచుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కలరాస్తుంది. సర్పంచుల నిధులు, విధుల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం, నిధులను పక్కదారి పట్టించడం, హక్కులను కాలరాస్తుండడంతో సర్పంచుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారిందని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 5 నెలలుగా విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వాన్నంగా మారింది.
గ్రామాలలో సర్పంచ్ లు చేపట్టిన అభివృద్ధి పనులలో చాలా వరకు బిల్స్ పెండింగులో ఉన్నాయి.. గ్రామాలలో సర్పంచ్ లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసినా కూడా బిల్స్ రాకపోవడంతో వారు అప్పుల పాలు అయ్యి, వడ్డీల భారం పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను విడుదల చేయడం లేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా తరలించడంతో సర్పంచ్ లు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. దీంతో గ్రామాలలో అభివృద్ధి పనులు అన్ని కుంటుపడిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ లకు ఈ ఎమ్ ఐ లు కట్టలేని పరిస్థితి ఉంది. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు.
అందువల్ల ఈ విషయంలో సీఎం వెంటనే స్పందించి కేంద్రం ఇచ్చిన నిధులను వెంటనే గ్రామ పంచాయతీలకు అందించాలని కోరారు. అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. గ్రామాలలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబందించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్పంచుల హక్కుల సాధన కోసం, గ్రామ పంచాయితీలకు నిధుల విడుదల కోసం జనవరి 2వ తేదీన ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతామని అన్నారు.