ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

Revanth Reddy Letter To CM KCR. సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను

By Medi Samrat  Published on  10 July 2021 9:07 AM GMT
ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లని మీరే పొగిడారు.. ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని.. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా అని లేఖ‌లో ప్ర‌శ్నించారు. ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా అంటూ ఫైర్ అయ్యారు.

2018లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదని.. 50 వేల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన ప్రకటన చీటింగ్ "వన్స్ మోర్" లాగా ఉందని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే.. మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయాల‌ని అన్నారు. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని.. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని.. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుందని రేవంత్ లేఖ‌లో పేర్కొన్నారు.


Next Story
Share it